స్త్రీ-పురుష సంబంధాలు: యజమానికి మూటలు మోసే గాడిద పై ఉన్న ప్రేమ
చాకలివాడు గాడిదకి బాగానే గడ్డి పెడతాడు, ఎందుకంటే అది అతని బట్టలు మోస్తుంది కాబట్టి. గాడిద కుమ్మరివాని మట్టి కూడా మోస్తుంది కాబట్టి కుమ్మరివాడు కూడా తన గాడిదకీ గడ్డి బాగానే పెడతాడు. కంచర గాడిద (खच्चर) అంత కంటే ఎక్కువ బరువులు మోస్తుంది కాబట్టి కంచర గాడిదలని పెంచేవాళ్ళు వాటికి ఖరీదైన ఉలవలు కూడా పెడతారు. యజమాని గాడిదకి ఎంత బాగా గడ్డి పెట్టినా అతనికి గాడిద మీద ఉన్నది ప్రేమ అని అనుకోలేము. అది కేవలం వస్తు వినియోగ సంబంధం. స్త్రీ ఇంటి పనులు చేస్తోందని భర్త ఆమెని పోషించినంతమాత్రాన భర్తకి భార్య మీద ఉన్నది నిజమైన ప్రేమ అని అనుకోలేము. మూడేళ్ళ క్రితం నేను వ్రాసిన కథలని విమర్శించిన రాధిక అనే ఆవిడని ఉద్దేశించే ఈ సమాధానాలు వ్రాస్తున్నాను.
రాధిక గారి దృష్టిలో స్త్రీవాదం అంటే ఏమిటి? కేవలం భర్త భార్యని కొట్టకూడదు అనుకోవడమే కదా ఆవిడ దృష్టిలో స్త్రీవాదం అంటే. ఆ లాజిక్ ప్రకారం చూస్తే చాకలివాడు తన గాడిదని కొట్టడు, కుమ్మరివాడు తన గాడిదని తన్నడు. అలాగని గాడిదలని పెంచేవాళ్ళకి నిజంగా గాడిదల మీద ప్రేమ ఉందని అనుకోగలమా? నేను వ్రాసిన "వెన్నెల దారి" కథలో భర్త తన పొలంలో పని చేసే అమ్మాయితో తిరుగుతున్నాడని భార్య తన మరిదితో లేచిపోతుంది. నేను అలా వ్రాయడం రాధిక గారికి నచ్చలేదు. ఆవిడ మరిదితో లేచిపోకుండా ఉద్యోగం చూసుకుని పిల్లలని చూసుకుంటున్నట్టు వ్రాసి ఉంటే ఆ కథని ఆమె అంగీకరించేదట. ఒకప్పుడు భర్త చనిపోయిన స్త్రీలకి రెండో పెళ్ళి చేసుకునే అవకాశం ఉండేది కాదు. భర్త చనిపోయిన స్త్రీలు విధవాశ్రమాలలో చేరి, అక్కడ ఉంటూ ఏవో పనులు చేసుకుని డబ్బులు సంపాదించి పిల్లలని పోషించుకునేవాళ్ళు. భర్త చనిపోయిన స్త్రీలు, భర్తకి విడాకులు ఇచ్చిన స్త్రీలు కేవలం పిల్లలని చూసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు వ్రాస్తే అది స్త్రీవాదం ఎలా అవుతుంది? పరిత్యక్త స్త్రీ పర పురుషుణ్ణి పెళ్ళి చేసుకోకూడదనే భూస్వామ్య భావజాలాన్ని ఆమె సమర్థిస్తున్నట్టా? ఆమె ఐపి అడ్రెస్ చూస్తే ఆమె మేడిసన్‌లో ఉంటున్నట్టు తెలుస్తోంది. ఆమె మేడిసన్‌లో స్థిరపడినా అగ్నిహోత్రావధానుల కాలం నాటి ఆలోచన శైలి ఆమెలో ఇంకా పోలేదు. ఈ విషయాలన్నీ ఇప్పుడు మళ్ళీ గుర్తు తెచ్చుకోవడానికి ఒక బలమైన కారణం ఉంది. స్త్రీవాదం అంటే ఏమిటో తెలియని కొంత మంది స్త్రీవాదం అంటే కేవలం భర్త భార్యని కొట్టకుండా ఉండడం అనే భ్రమలో ఉన్నారు. అలాగైతే భూస్వామి కూడా తన పాలేరుని కొట్టడు కనుక భూస్వామి-పాలేరు సంబంధంలో ఎలాంటి వైరుధ్యం లేదనుకోవాలా? ఈ పోస్ట్ చదవండి: "కళ్ళు తెరిచిన సీత" ఈ పోస్ట్‌లో వచ్చిన సమాధానాలు చదివిన తరువాతే నాకు యజమానికి గాడిద పై ఉండే ప్రేమ గురించి గుర్తొచ్చింది. ఇప్పటి స్త్రీల జీవితాలు గాడిద బతుకుల కంటే గొప్పగా లేవు కదా.