ఇంత సులభంగా కుల రాజకీయాలు నడిపేవాళ్ళకి వోట్లు వేస్తారా? అక్కడే జ్ఞానం ఎందుకు లోపిస్తుంది?
పూర్వం మన దేశంలో ఒక ఆటవిక ఆచారం ఉండేది. ఒక చండాల జాతివాడు దారిలో నడుస్తున్నప్పుడు చెక్క వాయించుకుంటూ నడవాలి. అగ్రకులాలవాళ్ళు ఎదురొచ్చినప్పుడు వాళ్ళు చెక్క శబ్దం విని, అతను చండాలుడని గుర్తించి పక్కకి తప్పుకుంటారు. చండాలుడు చెక్క వాయించకుండా తిరిగాడనుకోండి, తరువాత అతను చండాలుడని తెలిస్తే అతనికి కాల్చిన ఇనుముతో వాతలు పెట్టే శిక్షలే పడేవి.
రంగనాయకమ్మ గారు వ్రాసిన "దళిత సమస్య పరిష్కారానికి" పుస్తకం చదువుతున్నప్పుడు నా పక్కనే ఒక అగ్రకులానికి చెందిన అమ్మాయి కూర్చుని ఉంది. నేను ఎవరికీ కులం పేరు అడగను కానీ ఆ అమ్మాయి కులం పేరు ఎవరో చెపితే నాకు తెలిసింది. ఆ అమ్మాయికి ఒక ప్రశ్న అడిగాను "మీరు రోడ్ మీద బస్ కోసం నిలబడి ఉన్నారు, మీ పక్కనే రెల్లి కులస్తుడు నిలబడి ఉన్నాడు, అతను రెల్లి కులస్తుడు అని తెలిస్తే మీరు పక్కకి తప్పుకుంటారా?" అని. అప్పుడు ఆ అమ్మాయి ఇలా సమాధానం చెప్పింది "ఒక వ్యక్తి కులం పేరు చెప్పుకుంటేనే తెలుస్తుంది కానీ చెప్పుకోకపోతే ఎలా తెలుస్తుంది? దళితుడు పక్కన నిలబడినంతమాత్రాన పక్కకి తప్పుకోవడం ఎలా జరుగుతుంది?" అని. నేను ఇలా అన్నాను "నా షాప్‌కి ఎడమ వైపే రెల్లి వీధి ఉంది. మీరు నా షాప్‌కి వచ్చేటప్పుడు మీ పక్కన నడుచుకుంటూ వెళ్ళేవాడు రెల్లి కులస్తుడు కూడా కావచ్చు కదా." అని. అప్పుడు ఆమె ఇలా సమాధానం చెప్పింది "ఎంత రెల్లి వీధి నుంచి వచ్చినా అతను ఆ వీధి నుంచి వచ్చాను అని చెప్పుకుంటేనే కదా అతను రెల్లి కులస్తుడని తెలుస్తుంది, అతను పక్కన నడిచినంతమాత్రాన పక్కకి తప్పుకోవడం ఎలా సాధ్యం?" అని.నాలుగైదు కులాలవాళ్ళు ఉండే చోట ఒకడు కులం పేరు చెప్పుకుంటే గానీ ఇతరలకి అది తెలియదు. మరి రాజకీయ నాయకుల కులాల పేర్లు చిన్న పిల్లలకి కూడా ఎలా తెలుస్తున్నాయి? పత్రికలు "కులం" అనే పదం వ్రాయకుండా "సామాజిక వర్గం" అనే పదం వ్రాస్తున్నది కులవ్యవస్థని గ్లోరిఫై చెయ్యడానికే. అది కులానికి ఏ రకంగానూ పరోక్ష సూచిక కాదనీ, ప్రత్యక్ష సూచిక మాత్రమే అనీ అందరికీ తెలిసినదే. అలాంటప్పుడు "సామాజిక వర్గం" అని కొత్త పదాలు కనిపెట్టి నాటకాలు ఆడడం ఎందుకు?ముక్కూముఖం తెలియని వ్యక్తికి కులం పేరు అడగడానికి ఎవరికైనా మొహమాటం ఉంటుంది. పత్రికల స్టైల్‌లో "మీది ఏ సామాజిక వర్గం" అని అడిగే ధైర్యం కూడా ఉండదు. రాజకీయాల విషయానికొచ్చినప్పుడే సిగ్గూ, మొహమాటం అనేవి లేకుండా కులాన్ని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నట్టు? వాళ్ళు "కులం" అనే పాత పేరు చెప్పకుండా "సామాజిక వర్గం" అనే కొత్త పేరు చెప్పినా వాళ్ళు నడిపేవి "కుల రాజకీయాలే" అని అందరికీ సులభంగా తెలిసిపోతుంది. అందరికీ సులభంగా తెలిసిపోతున్నప్పుడు పేర్లు మార్చి నాటకాలు ఆడడం అవసరమా?ఒక టివి చానెల్‌లో ఏదో విషయమై చర్చ జరిగింది. మధ్యలో కుల రాజకీయాల ప్రస్తావన వచ్చింది. ఒకామె ఇలా అడిగింది "ఈ రోజుల్లో కుల రాజకీయాలు అవసరమా? సామాజిక వర్గం అనే పేరు పెట్టి కులాన్ని గ్లోరిఫై చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాము, అలాంటివి ఈ ఆధునిక కాలంలో అవసరమా?" అంటూ. ఆమె దాని గురించి అడుగుతూ ఉండగానే ఇతర వక్తలు సమాధానం చెప్పకుండా విషయం దాటవెయ్యడానికి ప్రయత్నించారు. ఎంత "సామాజిక వర్గం" అనే కొత్త పేరు పెట్టినా అది "కులం" అనే పాత సంప్రదాయాన్నే సూచిస్తుంది కానీ అందులో కొత్తదనం ఏమీ ఉండదు. దానికి సమాధానం చెప్పలేము అని ముందే ఊహించి ఇతర కులగజ్జి వక్తలు ప్రశ్న పూర్తవ్వకముందే దాటవెయ్యడానికి ప్రయత్నించారు. కులం అనేది నిజ జీవితంలో చాలా సందర్భాలలో అసంగత వ్యవహారమే. కానీ రాజకీయాలలోనే దాని యొక్క సాంగత్యం (relevance) ఎందుకు ఏర్పడుతుంది? నిజ జీవితానికి అవసరమైన ఇంకిత జ్ఞానం రాజకీయాలకి అవసరం లేదా? రాజకీయాల రంగం అనేది వ్యక్తిగత గొప్పలు (individual prestige) లేదా కుల గొప్పలు (caste prestige) ప్రదర్శించుకునే రంగమా? కుల రాజకీయాలు నడిపేవాళ్ళకి ఈ ప్రశ్నలకి సమాధానాలు చెప్పే బాధ్యత లేదా?