స్త్రీలలో కూడా స్త్రీవాదాన్ని వ్యతిరేకించేవాళ్ళు ఉంటారా?
స్త్రీలలో కూడా స్త్రీవాదాన్ని వ్యతిరేకించేవాళ్ళు ఉంటారా?
ఈ ప్రశ్న అడిగితే 'ఉంటారు, ఉన్నారు కూడా' అని సమాధానం చెప్పాల్సి వస్తుంది.వందల కోట్లు ఆస్తి ఉన్న సినిమా నటుడు జితేంద్ర భార్య శోభా కపూర్ కొన్ని కోట్లకి కక్కుర్తి పడి ఒక స్త్రీ జీవితాన్ని చాలా చెత్తగా చూపించే సినిమా నిర్మించింది. ఒకవేళ మగ నిర్మాత ఆ అశ్లీల సినిమాని నిర్మించినా అందులో హీరోయిన్‌గా నటించేది స్త్రీయే కాబట్టి, ఆడదాని సహకారం లేకుండా ఆ సినిమా నిర్మాణం జరగదు కాబట్టి అందులో స్త్రీ తప్పు కూడా ఉందనే విషయాన్ని కాదనలేము. వ్యాపారం కోసం పురుషాధిక్యతని ఉపయోగించుకుని అశ్లీల సినిమాలలో నటించే స్త్రీల సంగతి సరే, తమ తాత్కాలిక ప్రయోజనాల కోసం పురుషాధిక్యతని ఉపయోగించుకునేవాళ్ళ సంగతి ఏమిటి?ఒకామె తల్లితండ్రులు రెండు లక్షలు కట్నం ఇచ్చి ఆమెకి పెళ్ళి చేశారు. ఆమె తోటి కోడలు పుట్టింటి నుంచి లక్ష రూపాయలే కట్నం తెచ్చింది. చిన్న కోడలు తెచ్చిన లక్ష రూపాయల కట్నం సరిపోలేదని అత్తమామలు ఆమెని వేధించారు. ఆమె అత్తమామలకి భర్త, బావ గారితో పాటు పెద్ద కోడలు కూడా సహకరించింది. అలా సహకరిస్తే పెద్ద కోడలికి ఏమొస్తుంది? ఆమె తల్లితండ్రులు కూడా రెండు లక్షలు కట్నం ఇచ్చి నష్టపోయారు కదా. ఆమె తల్లితండ్రులు రెండు లక్షలు కట్నం ఇవ్వగలిగే ఆర్థిక స్తోమత ఉన్నవాళ్ళు కావచ్చు కానీ ఆమె తోటి కోడలి తల్లితండ్రులు అంత కట్నం ఇవ్వగలిగేంత ఆర్థిక స్తోమత ఉన్నవాళ్ళు కాకపోవచ్చు కదా? ఈ విషయం పెద్ద కోడలికి తెలియదా? కట్నం ఇవ్వడం, తీసుకోవడం తప్పైనప్పుడు పెళ్ళి తరువాత కూడా అదనపు కట్నం అడగడం ఇంకెంత తప్పు కావాలి? ఒకవేళ చిన్న కోడలి తల్లితండ్రులు అప్పులు చేసి అత్తవారికి అడిగిన కట్నం ఇచ్చినా ఆ డబ్బులు అత్తమామల చేతుల్లోనే ఉంటాయి కానీ తోటి కోడలి చేతిలోనో, బావగారి చేతిలోనో ఉండవు. ఇది బావగారికి కూడా అనవసరమైన విషయం అయినా తోటి కోడలు అదనపు కట్నం విషయంలో అత్తమామలకి ఎందుకు సహకరించింది? ఆమె ప్రయోజనం కాని ప్రయోజనం కోసం స్త్రీల హక్కులకి వ్యతిరేకమైన పని చేసింది. తాత్కాలిక ప్రయోజనాల కోసం పాడు పనులు చేసేవాళ్ళు ఉంటారు. ప్రయోజనం కాని ప్రయోజనం కోసం గడ్డి తినడమే ఇక్కడ విచిత్రం. భర్త చనిపోయిన స్త్రీకి బలవంతంగా పసుపుకుంకుమలు తీసేసి విధవని చేసే అనాగరిక కార్యక్రమం దగ్గర ఉండి జరిపించేది ఆడవాళ్ళే. అలాంటి పనులు చేస్తే వాళ్ళకి ఎలాంటి పరోక్ష ప్రయోజనం కూడా కలగదు. వాళ్ళు కేవలం పురుషులని ప్రసన్నం చేసుకుని తాము ఉత్తమ పతివ్రతలమని అనిపించుకోవడానికి ఆ అనాగరిక కార్యం చేస్తారు.