Posterous theme by Cory Watilo

ప్రకృతి ముందు సమానమే కానీ సమాజం ముందు సమానం కాదు

Rich-and-poor

ధనవంతుని శరీర నిర్మాణానికీ, పేదవాని శరీర నిర్మాణానికీ మధ్య ఎలాంటి తేడా లేదు అని తెలిసిన డాక్టర్ కూడా ధనవంతుణ్ణి ఒకలాగ, పేదవాణ్ణి ఇంకోలాగ ఎందుకు చూస్తాడు? తాను చదివిన భౌతిక శాస్త్రమే అతనికి గుర్తుండదా? అతను చదివిన భౌతిక శాస్త్రం అతనికి గుర్తుంటుంది. కానీ ఆ శాస్త్రాన్ని సమాజానికి అప్లై చెయ్యడు. "ధనవంతుని శరీరంలో ఉన్న రక్తం ఎరుపే, పేదవాని శరీరంలోని రక్తం కూడా ఎరుపే. కనుక ధనవంతులు పేదవాళ్ళకి తక్కువ గౌరవం ఇవ్వకూడదు" అని సంస్కరణవాదులు వందలాది సంవత్సరాల నుంచి చెపుతున్నారు కానీ సమాన గౌరవం అనేది ఎందుకు రాలేదు? ఎందుకంటే ప్రకృతిలో మనుషులందరూ సమానమే కానీ సమాజంలో మనుషులందరూ సమానం కాదు.

సామ్రాజ్యవాది శరీరంలోని రక్తం ఎరుపే, మూడో ప్రపంచ దేశానికి చెందిన వ్యక్తి శరీరంలోని రక్తం కూడా ఎరుపే. భారతీయులని "ఇండియన్ డాంకీస్" అని అన్న బ్రిటిష్ క్రికెటర్ నాసర్ హుస్సేన్‌కి కూడా ఈ విషయం తెలుసు. నాసర్ హుస్సేన్ తండ్రి కూడా భారతీయుడే. భారత దేశం నుంచి వలస వెళ్ళి ఇంగ్లాండ్‌లో స్థిరపడడం వల్ల గాడిద రక్తం మనిషి రక్తంగా మారిపోతుందా? భారతీయులు గాడిదలు కాదు అని నాసర్ హుస్సేన్‌కి తెలుసు. ధనవంతులు పేదవాళ్ళని జంతువులని చూసినట్టు ఎలా చూస్తారో, సామ్రాజ్యవాదులు కూడా మూడో ప్రపంచ దేశాలవాళ్ళని అలాగే పశువులని చూసినట్టు చూస్తారు.

స్వేచ్ఛ గురించీ, సమానత్వం గురించీ, సహోదరత్వం గురించీ బూర్జువా సంస్కరణవాదులు ఎన్ని కబుర్లైనా చెపుతారు. కానీ వాస్తవంలో కనిపించేది వేరు. ఒక డబ్బున్నవాడు పేదవాని పక్కన కూర్చోవడం ఎక్కడా కనిపించదు. సామ్రాజ్యవాద దేశాలకి చెందినవాళ్ళు మూడో ప్రపంచ దేశాలకి చెందినవాళ్ళని కుక్కలు, గాడిదలని చూసినట్టు చూడడం బాహాటంగానే కనిపిస్తుంది. కేవలం ప్రాకృతిక సమానత్వం ఉంటే సరిపోదు. ఆర్థిక సమానత్వం ఉంటేనే సామాజిక సమానత్వం వస్తుంది.