అన్నా హజారే ఉద్యమం ఎందుకు విఫలమయ్యింది? - ఒక సీరియస్ చర్చ
మన దేశం ఆర్థికంగా ఎందుకు వెనుకబడింది అని అడిగితే ఒక స్టీరియోటిపికల్ ఆలోచనాపరుడు ఇలా సమాధానం చెపుతాడు "స్వార్థ రాజకీయాలు, అవినీతి కారణం" అని. అవినీతి అంటే ఏమిటి? చట్ట వ్యతిరేకంగా చేసేది మాత్రమే అవినీతా? మార్కెట్‌లో రూపాయి పెట్టుబడి పెట్టి రెండు రూపాయలు సంపాదించు అనేది అవినీతి కిందకి రాదా? ఈ ప్రశ్నకి అతను సమాధానం చెప్పలేడు. అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడాడు కానీ ఆర్థిక అసమానతల గురించి ఎందుకు మాట్లాడలేదు అని మార్క్సిస్ట్‌లు అడిగితే "అవినీతికీ, ఆర్థిక అసమానతలకీ సంబంధం ఏమిటి? ఆర్థిక అసమానతల గురించి మాట్లాడనివాడు అవినీతి గురించి మాట్లాడకూడదా?" అని అన్నా హజారే అభిమానులు ప్రశ్నలు అడిగారు. అవినీతి పెద్ద సమస్యా, లేదా ఆర్థిక అసమానతలు పెద్ద సమస్యా? అని మనం అడిగామనుకోండి, అన్నా హజారే అభిమానులు ఇలా సమాధానం చెపుతారు "అవినీతిపరులు మనం టాక్స్‌లుగా కట్టిన డబ్బులనే భోంచేస్తున్నారు కనుక అవినీతిని వ్యతిరేకించాల్సిందే" అని. పేదవాళ్ళు ఎలాగూ టాక్స్‌లు కట్టరు కనుక ఈ సమాధానం చెపితే పేదవాళ్ళు అవినీతిని వ్యతిరేకిస్తారా? నిత్య జీవితంలో ఏవో సమస్యలతో ఉండే పేదవాళ్ళు తాము కట్టని టాక్స్ డబ్బుల కోసం అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొంటారా? అవినీతిని వ్యతిరేకించాలంటే సామాజిక బాధ్యత ఉండాలి. కేవలం మా టాక్స్ డబ్బులు భోంచేస్తున్నారు కనుక మేము అవినీతిని వ్యతిరేకిస్తున్నాము అనడం సామాజిక బాధ్యత అవుతుందా లేదా స్వార్థం అవుతుందా? నాకు IDBIలో అకౌంట్ ఉంది, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో అకౌంట్ లేదు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఫ్రాడ్ జరిగితే నాకు రూపాయి నష్టం కూడా రాదు. అలాగని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఫ్రాడ్ జరిగితే నాకేమిటి సంబంధం అని అనుకోవాలా? సామాజిక బాధ్యత గురించి మాట్లాడకుండా అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇలాగే ఉంటుంది. అన్నా హజారే కూడా ఎన్నడూ సామాజిక బాధ్యత గురించి మాట్లాడలేదు. అందుకే అతని అనుచరులలో సామాజిక బాధ్యత తెలియనివాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు. స్వార్థపరుడు సమాజం గురించే కాదు, తన చుట్టూ ఉన్న మనుషుల గురించి కూడా ఆలోచించడు. ఒక స్వార్థపరుడు ఓ బ్యాంక్‌లో ఇరవై వేలు ఫిక్సెడ్ డిపాజిట్ వేశాడనుకుందాం. అదే బ్యాంక్‌లో ఫ్రాడ్ జరిగిందనుకుందాం. ఫ్రాడ్ చేసిన వ్యక్తిని ఉద్యోగం నుంచి పీకేశారు. ఫ్రాడ్ జరగకముందే జాగ్రత్త తీసుకోలేదని మరి కొంత మంది ఉద్యోగులని కూడా ఉద్యోగం నుంచి పీకేశారు. ఈ విషయం ఇరవై వేలు ఫిక్సెడ్ డిపాజిట్ చేసిన స్వార్థపరునికి తెలిసిందనుకుందాం. అతను కేవలం "బ్యాంక్‌వాళ్ళు తన డబ్బులు తనకి తిరిగి ఇవ్వగలరా, లేదా?" అనే విషయమే ఆలోచిస్తాడు కానీ ఫ్రాడ్ వల్ల కొంత మంది ఉద్యోగాలు పోయినందుకు అతను బాధపడడు. బ్యాంక్‌వాళ్ళు అతని డబ్బులు అతనికి తిరిగి ఇస్తారని అనిపిస్తే ఫ్రాడ్ జరిగిన విషయం కూడా ఆ వ్యక్తి మర్చిపోతాడు. ఎందుకంటే స్వార్థం అనేది అతని చుట్టు జరిగిన వాటి గురించి కూడా అతన్ని ఆలోచించనివ్వదు. తన చుట్టూ జరిగేవాటి గురించే ఆలోచించనివాడు దేశంలో జరుగుతోన్న అవినీతి గురించి ఎక్కడ ఆలోచిస్తాడు? అన్నా హజారే ఆర్థిక విధానాల గురించి ఎందుకు మాట్లాడలేదు అని మనం అడిగితే "ఆర్థిక విధానాలకీ, అవినీతికీ సంబంధం ఏమిటి?" అని అన్నా హజారే అభిమానులు అడుగుతారు. ఆర్థిక విధానాలకీ, అవినీతికీ మధ్య సంబంధం ఉంది.దోచుకునేవాడు కేవలం చట్టం అనుమతించిన పద్దతులలోనే దోచుకోవాలనుకోడు. మన దేశంలో ఫాక్టరీలలో కార్మికుల చేత ఎనిమిది గంటలకి పైగా పనులు చెయ్యించుకోవడం చట్ట వ్యతిరేకం కాదు, కార్మికులకి ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వకపోవడం కూడా చట్ట వ్యతిరేకం కాదు, దేశంలోని ఖనిజ సంపదని బహుళజాతి కంపెనీలకి అమ్మెయ్యడం కూడా చట్ట వ్యతిరేకం కాదు, దేశంలోని వ్యవసాయ భూములకి బహుళజాతి కంపెనీలకి కట్టబెట్టడం కూడా చట్ట వ్యతిరేకం కాదు. అయితే దోచుకునేవాళ్ళు కేవలం ఈ చట్టపరమైన అవకాశాలని ఉపయోగించుకుని మాత్రమే దోచుకుంటారనుకోవాలా? వాళ్ళు మంత్రులకి లంచాలు ఇచ్చి ప్రోజెక్ట్‌లు తమకి దక్కించుకోవడం లాంటివి చెయ్యరని అనుకోవాలా? ఏ దేశంలోనైనా పాలక వర్గ పార్టీలు మార్కెట్ పెట్టుబడిదారులు ఇచ్చిన విరాళాలతోనే పని చేస్తాయి. అటువంటప్పుడు పాలక వర్గ పార్టీలు మార్కెట్ పెట్టుబడిదారులకి నష్టం కలిగించే చట్టాలు ఎలా తయారు చేస్తాయి? 2G కుంభకోణం మన్మోహన్ సింగ్‌కి తెలిసే జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. అంత పెద్ద కుంభకోణం ప్రధాన మంత్రికి తెలియకుండా చెయ్యడం సాధ్యం కాదు కూడా. స్వయంగా అవినీతిపరుడైన మన్మోహన్ సింగ్ లోక్‌పాల్ చట్టం తయారు చేస్తాడని అన్నా హజారే ఎలా అనుకున్నట్టు? లోక్‌పాల్ చట్టం తయారు చేస్తే మన్మోహన్ సింగ్ ఏయే కంపెనీలతో కాంట్రాక్ట్‌లు కుదుర్చుకున్నాడు అనే విషయాలు కూడా బయటపడతాయి. ఏ పాలకవర్గంవాడైనా తనకు తానుగానే కొల్లేటిలోకి దిగుతాడా? లోక్‌పాల్ బిల్ అమలులోకి రాకుండా మన్మోహన్ సింగ్ తన జాగ్రత్తలు తాను తీసుకుంటాడని తెలిసే అన్నా హజారే ఈ ఉద్యమం నడిపాడు. అందుకే అన్నా హజారే నడిపిన లోక్‌పాల్ ఉద్యమం విఫలమయ్యింది. లోక్‌పాల్ చట్టం తేవడం సాధ్యం కాదని తెలిసినా కొంత మంది అన్నా హజారేకి మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం సరళీకృత ఆర్థిక విధానాలని పక్కాగా అమలు చెయ్యడంలో విఫలమయ్యిందనే అసంతృప్తి కొంత మంది ఉన్నత వర్గంవాళ్ళలో ఉంది. కాంగ్రెస్ కూడా సరళీకృత ఆర్థిక విధానాలని నమ్ముకునే పార్టీయే కానీ బిజెపి తిరిగి అధికారంలోకి వస్తే ఆ పార్టీ సరళీకృత ఆర్థిక విధానాలని పక్కాగా అమలు చేస్తుందని భావించి కొందరు కాంగ్రెస్‌ని ఇరకాటంలో పెట్టడానికి అన్నా హజారేకి మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్‌ని వ్యతిరేకించే RSS కూడా అన్నా హజారేకి మద్దతుగా కార్యకర్తలని సప్లై చేసింది. కాంగ్రెస్‌ని వ్యతిరేకించే పార్టీలు అతనికి కార్యకర్తలని సప్లై చేసినా హజారే తన ఉద్యమాన్ని సమర్థవంతంగా నడపలేకపోయాడు. అయినా అన్నా హజారేని హీరోగా పొగిడే పత్రికలూ, టివి చానెళ్ళూ ఉన్నాయి.