కులవాదం, లింగవాదం, వర్గవాదం, వైయుక్తికవాదం - ఇందులో ఏది సత్యం?
ఆర్యన్ ఇన్వేజన్ థియరీ గురించి మనం ఆ సిద్ధాంతాన్ని వ్యతిరేకించేవాళ్ళతో చర్చించడానికి ప్రయత్నించామనుకోండి, వాళ్ళు ఆ చర్చకి ఒప్పుకోరు. వాళ్ళు ఆ చర్చని దాటవెయ్యడానికి ప్రయత్నించి "ఆర్య-ద్రవిడ సిద్ధాంతం తప్పని ఎప్పుడో తేలిపోయింది" అని వాదిస్తారు. నిజానికి ఆర్యన్ ఇన్వేజన్ థియరీ నూరు శాతం నిజమే. కానీ కేవలం DNA పరీక్షల ఆధారంగా ఒక వ్యక్తిది ఏ కులమో చెప్పడం సాధ్యం కాదు అనే ఒకే పాయిట్ చెప్పి ఆర్య-ద్రవిడ సిద్ధాంతం తప్పు అని వాదించేవాళ్ళు ఉన్నారు.
ఏ కాలంలోనైనా కులాంతర వివాహాలు చేసుకునేవాళ్ళు కొంత మందైనా ఉంటారు. ఒక కులానికి చెందిన వ్యక్తికి ఇంకో కులానికి చెందిన వ్యక్తితో దూరపు రక్త సంబంధం ఉండడం ఏ కాలంలోనైనా సంభవమే. కనుక DNA పరీక్షల ద్వారా కులాన్ని నిర్ణీతంగా చెప్పడం సాధ్యం కాని పని. అంత మాత్రాన ఆర్య-ద్రవిడ సిద్ధాంతం తప్పని అనుకోలేము. అగ్రకులాలవాళ్ళలో ఎక్కువ మంది ఇప్పటికీ తెల్లని వర్ణంలోనే కనిపిస్తున్నారు, దళితులలో ఇప్పటికీ ఎక్కువ మంది నల్లని వర్ణంలోనే కనిపిస్తున్నారు. అగ్రకులాలవాళ్ళు ఆవు మాంసం ముట్టుకోరు. దళితులు & గిరిజనులు ఇప్పటికీ ఆవు మాంసం, పోతు మాంసం తింటారు. సంస్కృతి, ఆచారాలలో కూడా అగ్రకులాలవాళ్ళకీ, దళితులకీ మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్యన్ ఇన్వేజన్ థియరీ తప్పనీ, అన్ని కులాలూ సమానమేననీ వాదించేవాళ్ళు వ్యక్తిగతంగా కులాంతర వివాహాలు చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకోవడం లేదు? కులాన్ని స్టేటస్ సింబల్‌గా భావించేవాళ్ళు కులాంతర వివాహాలకి సాధారణంగా ఒప్పుకోరు. అయితే కాలేజ్‌లోనో, ఆఫీస్‌లోనో పరిచయమైన అమ్మాయితో ప్రేమలో పడినవాళ్ళు ఆ అమ్మాయిది ఏ కులమో తెలియకపోతే, కులం పేరు తెలిసినంతమాత్రాన ప్రేమని త్యజించలేము అనిపిస్తే, అప్పుడు కులంతో సంబంధం లేకుండా పెళ్ళి చేసుకోవడం జరుగుతుంది. పూర్వం ఒక ప్రాంతంవాళ్ళు ఇంకో ప్రాంతానికి వలస వెళ్ళినప్పుడు అక్కడ తమ జాతికి చెందినవాళ్ళు దొరక్కపోతే జాత్యాంతర వివాహాలే చేసుకునేవాళ్ళు. తమ ప్రాంతంలో తమ కులానికి చెందినవాళ్ళ జనాభా పైకి కనిపించేంత సంఖ్యలో ఉంటే వేరే కులంలో పెళ్ళి సంబంధాలు చూడడానికి ఒప్పుకుంటారా? అన్ని కులాలూ సమానమేనని వాదించే ఆర్యన్ ఇన్వేజన్ థియరీ వ్యతిరేకులు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఎంత కుల సమాజంలోనైనా కులాంతర వివాహాలు చేసుకునేవాళ్ళు కొందరైనా ఉంటారు. కులం కూడా మతంలాగే భావవాద పునాదుల మీద నిర్మించబడినది. కులం కూడా మతంలాగే మనిషిని పెద్దగా ప్రభావితం చెయ్యలేని విషయం. అందుకే కుల సంఘం నాయకులు తమ కులానికి చెందిన పేదవాళ్ళ దగ్గరకి వెళ్ళకుండా తమ కులానికి చెందిన డబ్బున్నవాళ్ళ చుట్టే తిరుగుతారు. మతం గురించి పట్టించుకోకుండా పెళ్ళి చేసుకునేవాళ్ళు ఉన్నట్టే కులం గురించి పట్టించుకోకుండా పెళ్ళి చేసుకునేవాళ్ళు కొంత మందైనా ఎల్లప్పుడూ ఉంటారు. భావవాదంలో నిబంధనకీ, ఆచరణకీ మధ్య వైరుధ్యం సహజం. లింగవాదంలో కూడా లింగవాదులు రూపొందించిన నియమాల ప్రకారం పని చెయ్యడం అన్ని సమయాలలోనూ సాధ్యం కాదు. పూర్వం భర్త చనిపోయిన స్త్రీకి గుండు గియ్యించి తెల్ల చీర కట్టే ఆటవిక ఆచారం ఉండేది. పది మంది వచ్చిపోయే ఆఫీస్‌లో ఉద్యోగం చేసే స్త్రీ తెల్ల చీర కట్టుకుని ఆఫీస్‌కి వెళ్ళడం ఏ రకంగానూ జరగని పని. పట్టణ ప్రాంతాలలో ఈ ఆటవిక ఆచారాలని ఆచరించడం టెక్నికల్‌గా సాధ్యం కాదు. ఒక అబ్బాయి తన ఆఫీస్‌లో పని చేసే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయి భర్త చనిపోయాడని తెలిసింది. ఆమె భర్త చనిపోయిన స్త్రీ అయినా సరే ప్రేమని కొనసాగించాలి, ఆమెని పెళ్ళి చేసుకోవాలి. ఆమె గత జీవితం గురించి తెలిసిందని ప్రేమని త్యజిస్తే దాన్ని ఎవరూ ప్రేమ అనరు, అది కేవలం సెక్స్ వాంఛ అవుతుంది, సెక్స్ వాంఛకి ప్రేమ అని పేరు పెట్టుకోవడం అవుతుంది. కనుక నిజమైన ప్రేమికుడు తన ప్రియురాలు భర్త చనిపోయిన స్త్రీ అని తెలిసినా ఆమె గత జీవితం గురించి ఆలోచించకుండా పెళ్ళి చేసుకుంటాడు. లింగవాదానికి సంబంధించి చాలా ఇష్యూస్ ఉన్నాయి. రైల్వేలలో స్త్రీకి TTE ఉద్యోగం ఇస్తారు కానీ లోకో డ్రైవర్ ఉద్యోగం ఇవ్వరు. TTE ఉద్యోగం చెయ్యగలిగేవాళ్ళు లోకో డ్రైవర్ ఉద్యోగం మాత్రం చెయ్యలేరా? ఆడవాళ్ళు లోకో డ్రైవర్లు అయితే ట్రైన్ యాక్సిడెంట్‌లు జరుగుతాయా? పురుషవాదులకి స్త్రీవాదులు ఇలాంటి ప్రశ్నలే అడుగుతారు. కానీ పురుషవాదులు ఈ ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేరు. సమాధానాలు చెప్పలేకపోయినా తమలో తప్పు ఉందని పురుషవాదులు ఒప్పుకోరు. నాన్‌సెన్స్ మాట్లాడాలనుకునేవాళ్ళు ఎంతైనా మాట్లాడగలరు. వాళ్ళు తమ వాదనని జస్టిఫై చేసుకోవడానికి లాజికల్ సమాధానాలు చెపుతారని అనుకోలేము. వర్గవాదం విషయానికి వద్దాం. వైట్ కాలర్ వర్గంవాళ్ళలో ఎక్కువ మంది కమ్యూనిజాన్ని వ్యతిరేకిస్తారు అనేది అందరికీ తెలిసినదే. నిరుద్యోగిగా ఉన్నప్పుడు నక్సలైట్లని సమర్థించినవాడు DSP ఉద్యోగం దొరికిన తరువాత పాలక వర్గానికి నమ్మిన బంటుగా మారిపోడని చెప్పలేము. వర్గం మారితే వైరుధ్యం మారుతుందనేది మార్క్సిస్ట్‌లందరికీ తెలిసిన విషయమే. అయితే పాలక వర్గంవాళ్ళు నక్సలైట్లని అణచివెయ్యడానికి విడుదల చేసిన నిధులని తమ సొంత ప్రయోజనాలకి దుర్వినియోగం చేసిన పోలీస్ అధికారులు ఉన్నారు. కార్మిక వర్గ పార్టీ అధికారంలోకి వస్తే తాము ఆ పార్టీ చెప్పినట్టు చెయ్యాల్సి వస్తుందని ఈ వైట్ కాలర్ ఖాకీ అధికారులకి తెలియదా? కార్మిక వర్గ పార్టీ అధికారంలోకి వస్తుందో, రాదో ఆ అధికారులకి తెలియదు కానీ ఆ పార్టీని అణచివెయ్యడానికి ప్రభుత్వం ఇచ్చిన డబ్బులని తమ సొంత ఖాతాలో వేసుకుని వ్యక్తిగత లాభం పొందుదామని అనుకుంటారు. ఈ వైట్ కాలర్ ఖాకీ అధికారులలో వర్గవాదం ఉందా, లేదా? వీళ్ళలో వర్గవాదం ఉంది కానీ వ్యక్తిగత ప్రయోజనాల గురించే ఎక్కువగా ఆలోచించే స్వార్థపరులు ఎల్లప్పుడూ వర్గ నియమాలకే కట్టుబడి ఉంటారా? అలా ఉండరు. సోషలిస్ట్ విప్లవం వస్తే ఇనిషియల్ స్టేజ్‌లో పరిశ్రమలనీ, వ్యవసాయ క్షేత్రాలనీ జాతీయం చెయ్యడం జరుగుతుంది, ఆ తరువాతి క్రమంలో ప్రైవేట్ ఆస్తిని పూర్తిగా రద్దు చెయ్యడం జరుగుతుంది. వైట్ కాలర్ ఖాకీ అధికారులకి ఈ విషయాలు తెలిసినా ఎప్పుడో రద్దుకాబడే ప్రైవేట్ ఆస్తి కోసం మన తాత్కాలిక ప్రయోజనాలని వదులుకోవడం ఎందుకు అని అనుకుంటారు. వ్యక్తిగత ప్రయోజనాలే ప్రధానం అనుకునేవాళ్ళకి ఆ ప్రయోజనాల ముందు వర్గ సంబంధాలు లెక్కలోకి రావు. వైట్ కాలర్ వర్గంలోనే కాదు, సాధారణ ప్రజలలో కూడా తాత్కాలిక ప్రయోజనాల కోసం ఆశపడేవాళ్ళు ఉంటారు. అందుకే పాలక వర్గంవాళ్ళు ఫ్రీ స్కీమ్‌లు లాంటివి పెట్టి జనం విప్లవం గురించి ఆలోచించకుండా చెయ్యడానికి ప్రయత్నిస్తారు. ఉచిత విద్యుత్, రాజీవ్ యువశక్తి లాంటివి ఆ రకం ఫ్రీ స్కీమ్‌లే. ప్రజలని చైతన్యవంతం చెయ్యడానికి ప్రయత్నించే మార్క్సిస్ట్‌లు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే విప్లవం రాకుండాపోతుంది. 1970ల టైమ్‌లో విజయనగరం జిల్లా బొబ్బిలి సమీపంలోని బలిజిపేట ప్రాంతంలో చాలా మంది గ్రామీణ పేదలు నక్సలైట్ ఉద్యమంలో చేరారు. నక్సలైట్లు తమకి లొంగిపోతే ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ప్రకటనని గుడ్డిగా నమ్మేసి చాలా మంది నక్సలైట్లు ప్రభుత్వానికి లొంగిపోయారు. కానీ ప్రభుత్వానికి లొంగిపోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి లాభం కలగలేదు. తొక్కడానికి రిక్షాలు మాత్రమే వచ్చాయి. ఏదో దొరుకుతుందని ఆశపడి రిక్షా కార్మికులుగా మారారు. తమ అధికారం పోకూడదనే నక్సలైట్లని లొంగిపొమ్మని చెప్పే పాలక వర్గంవాళ్ళు తమని నమ్మి లొంగిపోయినవాళ్ళకి నిజంగా లాభం కలిగిస్తారా? స్వార్థపరుడు ఎవడైనా తనని విశ్వసించిన వ్యక్తికి అదే విశ్వాసం రెసిప్రోకల్‌గా ఇస్తాడా? తమని నమ్మి లొంగిపోయిన మాజీ నక్సలైట్లకి ఈ స్వార్థ నాయకులు నడిపే ప్రభుత్వం ఎలా సహాయం చేస్తుంది? పేదవాళ్ళలో కూడా వర్గ చైతన్యం లేని వైయుక్తికవాదులు ఉంటారు. కానీ వైయుక్తికవాదం వల్ల వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం కలగదు. డబ్బున్నవాడు సమాజం గురించి ఆలోచించకపోయినా అతని భోగ విలాసాలు అతనికి ఉంటాయి. కానీ సాధారణ ప్రజల జీవితాలు మారాలంటే సామాజిక విప్లవాలు రావలసిందే.