Posterous theme by Cory Watilo

సోవియట్ యూనియన్ చరిత్రపై వక్రీకృత ప్రచారం - మారియో డి సౌసా (నాలుగో భాగం)

విలియమ్ హెర్స్ట్ పక్కా యథాస్తిథివాది, తెల్లజాతి దురహంకారి. అతను కమ్యూనిజాన్ని తీవ్రంగా వ్యతిరేకించేవాడు. అతను రాజకీయంగా కరడుగట్టిన అభివృద్ధి నిరోధక రాజకీయ వర్గం పక్షానే ఉండేవాడు. విలియమ్ హెర్స్ట్ 1934లో జెర్మనీ వెళ్ళాడు. హిట్లర్ అతన్ని అతిథిగా, స్నేహితునిగా ఆదరించాడు. విలియమ్ జెర్మనీ నుంచి తిరిగి వచ్చిన తరువాత అతని పత్రికలు మరింత అభివృద్ధి నిరోధకంగా మారిపోయాయి. ఆ పత్రికలు నిత్యం సోషలిజంపైనా, సోవియట్ సమాఖ్య పైనా, ముఖ్యంగా స్టాలిన్ పైనా బురద జల్లుతూ వ్యాసాలు ప్రచురించేవి. విలియమ్ తన పత్రికలని బహిరంగ నాజీ ప్రోపగాండా కోసం ఉపయోగించుకున్నాడు. హిట్లర్ కుడి భుజమైన గోరింగ్ వ్రాసిన వ్యాసాలని సీరియల్‌గా ప్రచురించేవాడు. ఆ వ్యాసాలకి పాఠకుల నుంచి వ్యతిరేకత రావడంతో హెర్స్ట్ ఆ వ్యాసాలని పత్రికల నుంచి ఉపసంహరించ వలసి వచ్చింది.

విలియమ్ హిట్లర్‌ని కలిసి వచ్చిన తరువాత అతని పత్రికలు "నిజాలని బయట పెట్టే వార్తలు" పేరుతో వచ్చిన వ్యాసాలతో నిండిపోయాయి. సోవియట్ సమాఖ్యలో భయానక ఘటనలు జరుగుతున్నాయని ఆ పత్రికలు వార్తలు వ్రాసేవి. హత్యలూ, హత్యాకాండలూ, బానిసత్వం, పాలకుల విలాసాలూ, ప్రజల ఆకలి చావులూ తదితర కథనాలు ప్రతి రోజూ అతని వార్తా పత్రికలలో ప్రముఖ వార్తలుగా ప్రచురించబడేవి. ఆ పత్రికలలో ప్రచురించబడిన మెటీరియల్ అంతా హిట్లర్ సీక్రెట్ పోలీస్ అయిన గెస్టపో అందించేది. ఆ పత్రికలలోని మొదటి పేజిలలో స్టాలిన్ రక్తం తడిసిన కృపాణం పట్టుకున్న ఫాబ్రికేటెడ్ చిత్రాలూ, సోవియట్ సమాఖ్యని నరకంలాగ చూపించే ఇతర ఫాబ్రికేటెడ్ భయానక చిత్రాలూ కనిపించేవి. ఆ భయానక కట్టుకథలని అమెరికాలోనూ, ఇతర దేశాలలోనూ ప్రతి రోజూ నాలుగు కోట్ల మంది చదివేవాళ్ళు.

ఉక్రెయిన్ కరువు పై సృష్టించబడిన కట్టు కథ

హెర్స్ట్ ప్రెస్ సోవియట్ సమాఖ్యకి వ్యతిరేకంగా మొదట్లో చేసిన ప్రచారాలలో ప్రముఖమైనది ఉక్రెయిన్ కరువు గురించిన కట్టు కథ.  ఆ కరువులో ఆరు మిలియన్లు (అరవై లక్షలు) మంది చనిపోయారని ప్రచారం చేశారు. ఆ ప్రచారం ఫిబ్రవరి 8, 1935న చికాగో అమెరికన్ పత్రికలోని మొదటి పేజిలో వచ్చిన కథనాలతో మొదలయ్యింది. ఉక్రెయిన్ కరువులో అరవై లక్షల మంది చనిపోయారని ఆ కథనం యొక్క సారాంశం. నాజీలు సప్లై చేసిన వార్తలతో ప్రెస్ టైకూన్ అయిన విలియమ్ హెర్స్ట్ "ఉక్రెయిన్‌లో బోల్షెవిక్‌లు ఉద్దేశపూర్వకంగా సృష్టించారని చెప్పబడిన కరువు & నరసంహారం" గురించిన కట్టుకథలు ప్రచారం చేశాడు. ఆ కథలకి వాస్తవంతో ఎలాగూ పోలిక లేదు. 1930లో సోవియట్ సమాఖ్యలో వ్యవసాయ సమిష్టీకరణ కోసం (భూమిని ఉమ్మడి ఆస్తిగా చెయ్యడం కోసం) పేద రైతులకీ & భూమి లేని కార్మికులకీ భూమి ఉన్న ధనిక రైతులతో పెద్ద వర్గ పోరాటమే జరిగింది. ఉమ్మది వ్యవసాయ క్షేత్రాలని సృష్టించడం కోసం పెద్ద వర్గ పోరాటమే జరిగింది.

ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పన్నెండు కోట్ల మంది రైతులు పాల్గొన్న వర్గ పోరాటం వల్ల వ్యవసాయంలో కొంత అస్థిరత ఏర్పడడం సహజం. ఆహార ఉత్పత్తి కూడా కొంత వరకు తగ్గడం సహజం. ఆహారం తక్కువగా తీసుకోవడం వల్ల ప్రజలు శారీరకంగా కొంత వరకు బలహీనపడిపోవడం జరుగుతుంది. ఆహారం సరిగా తిననివాళ్ళలో కొందరు వ్యాధులకి గురై చనిపోవడం కూడా జరుగుతుంది. ఆహార కొరత ఏర్పడిన సందర్భాలు ప్రపంచంలో అన్ని చోట్లా ఉన్నాయి. 1918 - 1920 మధ్య కాలంలో స్పానిష్ ఫ్లూ అనే వ్యాధి సోకి USA & యూరోప్‌లలో రెండు కోట్ల మంది చనిపోయారు. కానీ ఆ సందర్భాలలో ప్రభుత్వాలే ప్రజలని చంపాయని ఎవరూ ఆరోపించలేదు. ఆ అంటు వ్యాధుల విషయంలో ప్రభుత్వాల తప్పేమీ లేదు. ఆ అంటు వ్యాధులకి మందులు కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే ఆ అంటు వ్యాధులు వ్యాపించాయి. ఆ అంటు వ్యాధులకి మందులు కనిపెట్టిన తరువాత ఆ అంటు వ్యాధులని నిర్మూలించడం సాధ్యమయ్యింది. ఆ మందులు కూడా 1940ల చివరి వరకు ఎక్కువ మందికి అందుబాటులో ఉండలేదు అనే విషయం గుర్తుంచుకోవాలి.

కమ్యూనిస్ట్‌లు సృష్టించిన కరువు వల్ల ఉక్రెయిన్‌లో పదుల లక్షల మంది చనిపోతున్నారు అంటూ వ్రాసిన కట్టుకథలని హెర్స్ట్ ప్రెస్ కృత్రిమమైన ఆధారాలతో అసహ్యకరంగా ప్రచురించింది. హెర్స్ట్ ప్రెస్‌కి ఏ చిన్న రంధ్రం దొరికినా దాన్ని చూపించి, తాము వ్రాసిన కట్టుకథలు నిజాలని నిరూపించడానికి ప్రయత్నించేది. సోవియట్ సమాఖ్యకి వ్యతిరేకంగా వెలువడిన ప్రజాభిప్రాయం పేరుతో పెట్టుబడిదారీ దేశాలన్నిటినీ సోవియట్ సమాఖ్యకి వ్యతిరేకంగా మోటివేట్ చెయ్యడం జరిగింది. ఉక్రెయిన్ కరువుపై వచ్చిన కథనాలు అబద్దాలని సోవియట్ సమాఖ్య ప్రకటించింది. సోవియట్ సమాఖ్య సృష్టించిన కరువుకి వ్యతిరేకంగా ప్రజల నిరసనలు జరుగుతున్నాయని చెపుతూ సోవియట్ సమాఖ్య ఇచ్చిన సమాధానాలని పెడ చెవిన పెట్టారు. 1934 నుంచి 1987 వరకు ప్రచారమైనవి ఈ తరహా అబద్దాలే. యాభై సంవత్సరాలకి పైగా భావితరాల కోసం ప్రపంచ వ్యాప్తంగా సోషలిజానికీ, సోవియట్ సమాఖ్యకి వ్యతిరేకంగా అబద్దపు ఆరోపణలూ, కట్టుకథలూ ప్రచారం చేశారు.

(విలియమ్ హెర్స్ట్ చనిపోయిన తరువాత సామ్రాజ్యవాదులు హెర్స్ట్ ప్రెస్ ప్రోపగాండాని ఏ విధంగా కాపీ కొట్టారో, ఆ కథలు రోబర్ట్ కాంక్వెస్ట్, అలెక్సాండర్ సోల్ఝెనిట్సిన్ వంటి వారి పుస్తకాలలోకి ఎలా చేరాయో, ఉక్రెయిన్ కరువులో చనిపోయినవాళ్ళ గురించిన పాత లెక్కలని కాంక్వెస్ట్, సోల్ఝెనిట్సిన్ లాంటివాళ్ళు ఎలా మార్చి చూపించారో, అసలు లెక్కలకీ & ఈ ఫాబ్రికేటెడ్ లెక్కలకీ మధ్య ఉన్న తేడా ఏమిటో వగైరా విషయాలు తరువాతి భాగాలలో వ్రాస్తాను.)