సోవియట్ యూనియన్ చరిత్రపై వక్రీకృత ప్రచారం - మారియో డి సౌసా (మూడో భాగం)
హిట్లర్ స్నేహితుడు: విలియమ్ రాండాల్ఫ్ హెర్స్ట్నాజీలు సోవియట్ సమాఖ్యపై చేసిన ప్రచార యుద్ధంలో నాజీలకి సహాయం చెయ్యాలనుకున్న అమెరికన్ కోటీశ్వరుడు విలియమ్ రాండాల్ఫ్ హెర్స్ట్. హెర్స్ట్ అప్పట్లో ప్రముఖంగా తెలిసిన వార్తా పత్రికల యజమాని. అతనికి యెల్లో ప్రెస్, అనగా సంచలనవాద ప్రెస్‌కి పితృమూర్తిగా పేరు ఉండేది. విలియమ్ హెర్స్ట్ తండ్రి జార్జ్ హెర్స్ట్ ఒక మైనింగ్ పారిశ్రామికవేత్త కాగా 1885లో విలియమ్ హెర్స్ట్ పత్రిక ఎడిటర్‌గా జీవితాన్ని ప్రారంభించాడు. విలియమ్ తండ్రి సెనేటర్ (పార్లమెంట్ సభ్యుడు) & పత్రిక యజమాని కూడా. విలియమ్ తన తండ్రి నుంచి వారసత్వంగా శాన్ ఫ్రాన్సిస్కో డైలీ ఎక్సామినర్ పత్రిక బాధ్యతలు తీసుకున్నాడు. అది హెర్స్ట్ పాత్రికేయ సామ్రాజ్యానికి పునాదులు వేసింది. ఆ పాత్రికేయ సామ్రాజ్యం ఉత్తర అమెరికా ప్రజల ఆలోచనలనీ, జీవితాలనీ ప్రభావితం చేసింది. విలియమ్ హెర్స్ట్ తండ్రి చనిపోయిన తరువాత అతను తన తండ్రి నుంచి తనకి సంక్రమించిన మైనింగ్ కంపెనీల షేర్‌లు అన్నిటినీ అమ్మేసి ఆ డబ్బులని పాత్రికేయ పరిశ్రమలలో పెట్టుబడులుగా పెట్టాడు. విలియం "న్యూయార్క్ మార్నింగ్ జర్నల్" అనే సంప్రదాయక వార్తా పత్రికని కొనేసి దాన్ని పూర్తిగా సంచలన వార్తలు ప్రచురించే బుట్టగా మార్చేశాడు. ఎలాంటి నేరాలూ, ఘోరాలూ జరగని సమయంలో కూడా విలియమ్ డబ్బు ఖర్చు పెట్టి మరీ ఎక్కడి వార్తలో కొనేసి పత్రికలో ప్రచురించేవాడు. అతని దగ్గర పని చేసే విలేఖరులూ, ఫొటోగ్రాఫర్‌లు తమ బాస్ ఇచ్చే డబ్బుల కోసం అదే పని చేసేవాళ్ళు. అతని యెల్లో ప్రెస్ ప్రచురించిన కట్టు కథలూ, అబద్దాలూ అన్నీ నిజాలుగానే చెలామణి అయ్యేయి. ఈ అబద్దాలన్నీ హెర్స్ట్‌ని కోటీశ్వరునిగా బాగా వృద్ధిలోకి తెచ్చాయి, వార్తా పత్రికల ప్రపంచంలో అతన్ని ప్రముఖునిగా చేశాయి. 1935లో విలియమ్ హెర్స్ట్ ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకడు. అప్పట్లో అతని ఆస్తి $ 200 మిలియన్లు ఉండేది. విలియమ్ హెర్స్ట్ మార్నింగ్ జర్నల్ కొన్న తరువాత అమెరికా వ్యాప్తంగా ఇతర దిన పత్రికలూ, వార పత్రికలూ కొనడం కొనసాగించాడు. కొత్త దిన పత్రికలూ, వార పత్రికలూ కూడా పెట్టాడు. 1940లో విలియమ్ హెర్స్ట్ పాతిక దిన పత్రికలకీ, ఇరవై నాలుగు వార పత్రికలకీ, పన్నెండు రేడియో కేంద్రాలకీ, రెండు ప్రపంచ వార్తా కేంద్రాలకీ(ఒకటి సినిమా వార్తలు అందించే కేంద్రం) యజమానిగా ఉండేవాడు. హెర్స్ట్ వార్తా పత్రికలు రోజుకి పద మూడు మిలియన్ల కాపీలు (కోటి ముప్పై లక్షల కాపీలు) అమ్ముడుపోయేవి. ఆ కాపీలని నాలుగు కోట్ల మంది చదివేవాళ్ళు. హెర్స్ట్ యాజమాన్యంలోని అంతర్జాతీయ వార్తా కేంద్రాల నుంచి ఇతర దేశాలలోని పత్రికలకి అందే వార్తల ద్వారా, అతను ఇతర దేశాల పత్రికలకి కాపీ రైట్స్ అమ్మే వార్తల ద్వారా, ఇతర దేశాల పత్రికలలో అనువాదమయ్యే వార్తల ద్వారా అతని పత్రికల వార్తలని ఇతర దేశాలవాళ్ళు కూడా చదివేవాళ్ళు. ఈ విధంగా హెర్స్ట్ ప్రెస్ అమెరికా రాజకీయాలనీ, ప్రపంచ రాజకీయాలనీ ఎన్నో సంవత్సరాల పాటు బాగా ప్రభావితం చేసింది. చివరికి హెర్స్ట్ ప్రెస్ రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా పాల్గొనడాన్ని వ్యతిరేకించే స్థాయికి ఎదిగింది. మెక్‌కర్థీ నాయకత్వంలోని 1950ల కమ్యూనిస్ట్ వ్యతిరేక వేటని కూడా హెర్స్ట్ ప్రెస్ సమర్థించింది. (విలియమ్ రాండాల్ఫ్ హెర్స్ట్‌కీ, అతని ప్రెస్ చేసిన కమ్యూనిస్ట్ వ్యతిరేక ప్రోపగాండాకీ చాలా చరిత్ర ఉంది. విలియమ్ హెర్స్ట్, అతని ప్రెస్ మరియు అతని మద్దతుదార్ల గురించి మరింత సమాచారం తరువాతి భాగాలలో చూడొచ్చు.)