సోవియట్ యూనియన్ చరిత్రపై వక్రీకృత ప్రచారం - మారియో డి సౌసా (రెండో భాగం)
హిట్లర్ నుంచి హెర్స్ట్ వరకు, కాంక్వెస్ట్ నుంచి సోల్ఝెనిట్సిన్ వరకు వీళ్ళందరూ చేసిన ప్రోపగాండాతో నేరుగా ముడి ఉన్న చారిత్రక సంబంధం ఉంది. 1933లో జెర్మనీలో ప్రపంచం గుర్తించేంత ముద్ర కలిగిన రాజకీయ చారిత్రక మార్పులు జరిగాయి. జనవరి ముప్పైన హిట్లర్ జెర్మనీకి ప్రధాన మంత్రి అయ్యాడు, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. అది చట్టాల ఉల్లంఘననీ, హింసనీ నమ్ముకున్న ప్రభుత్వం. నాజీలు తమ అధికారాన్ని బలపరుచుకోవడానికీ & విజయాన్ని స్థిరపరచుకోవడానికీ మార్చ్ ఐదో తేదీన ఎన్నికలు జరపాలని నిర్ణయించారు. ఎన్నికల తేదీకి వారం రోజుల ముందు, అంటే ఫిబ్రవరి ఇరవై ఏడున జెర్మనీ పార్లమెంట్ భవనాన్ని తగలబెట్టి దాన్ని కమ్యూనిస్ట్‌లు తగలబెట్టారని ప్రచారం చేశారు. తరువాత జరిగిన ఎన్నికలలో నాజీలు పదిహేడు లక్షల ముప్పై వేల వోట్లు, రెండు వందల ఎనభై ఎనిమిది మంది సభ్యులతో ఎన్నికలలో గెలిచారు. (అంతకు ముందు వాళ్ళకి వచ్చినవి పదకొండు లక్షల డబ్బై వేల వోట్లు & ఉన్న సభ్యులు నూట తొంభై ఆరు మంది). నాజీలు కమ్యూనిస్ట్ పార్టీని నిషేధించిన తరువాత సోషల్ డెమోక్రాట్‌లనీ, కార్మిక సంఘాల సభ్యులనీ కూడా నిర్బంధించడం మొదలుపెట్టారు. మొదట్లో పెట్టిన అక్రమ నిర్బంధన శిబిరాలన్నీ నిర్బంధించబడిన వామపక్ష పార్టీలకి చెందిన స్త్రీలు-పురుషులతో నిండి ఉండేవి. అదే సమయంలో హిట్లర్ మితవాద వర్గం సహాయంతో తన అధికారాన్ని బలపరుచుకున్నాడు. మార్చ్ ఇరవై నాలుగున హిట్లర్ పార్లమెంట్‌లో ఒక బిల్ పాస్ చేశాడు. ఆ బిల్ ప్రకారం హిట్లర్ నాలుగు సంవత్సరాల కాలం వరకు పార్లమెంట్‌తో ఎటివంటి సంప్రదింపులూ లేకుండానే దేశాన్ని పరిపాలించొచ్చు. అప్పుడు హిట్లర్ యూదులని కూడా హతమార్చడం మొదలుపెట్టాడు. కమ్యూనిస్ట్‌లనీ, ఇతర వామపక్షవాదులనీ పంపిన నిర్భందనా శిబిరాలలోకే యూదులని కూడా పంపడం మొదలుపెట్టాడు. హిట్లర్ సంపూర్ణాధికార కాంక్షలో పైకి ఎదగసాగాడు. 1918లో జెర్మనీలో ఆయుధీకరణ & సైనికీకరణలపై విధించబడిన పరిమితులని తొలిగిస్తూ హిట్లర్ కొత్త చట్టాలు తయారు చేశాడు. జెర్మనీలో ఆయుధీకరణ మళ్ళీ వేగం పుంజుకుంది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ రాజకీయాలలో సోవియట్ యూనియన్‌పై అబద్దాల ప్రచార పర్వం మొదలయ్యింది. జెర్మన్ ఆధీన భూభాగంగా ఉక్రెయిన్జెర్మనీలో హిట్లర్‌కి కుడి భుజంగా అతని మంత్రి గోబెల్స్ ఉండేవాడు. అతను ప్రోపగాండా శాఖ మంత్రి. అతను ప్రజలలోకి ప్రచారాన్ని తీసుకెళ్ళడం ద్వారా నాజీల కలలని సాకారం చెయ్యడానికి ప్రయత్నించేవాడు. జాతి రీత్యా పరిశుద్ధులైనవాళ్ళు గ్రేటర్ జెర్మనీగా ఏర్పడాలని నాజీల కల. వాళ్ళకి విశాలమైన భూభాగం కావాలని వాంఛ. భూభాగపు విశాలీకరణలో భాగంగా జెర్మనీకి తూర్పున ఉన్న ప్రాంతాలని కూడా కలుపుకోవాలనుకున్నారు. ఆ ప్రాంతాలని ఆక్రమించుకునే యోచనలో ఉన్నారు. 1925లో హిట్లర్ తాను వ్రాసిన Mein Kampf (నా పోరాటం) పుస్తకంలో ఉక్రెయిన్ జెర్మన్ ఆవాసాల కోసం ముఖ్యమైన భూభాగం కావాలని కోరుకుంటున్నట్టు వ్రాసాడు. ఉక్రైన్ & ఇతర తూర్పు యూరోప్ దేశాలు జెర్మన్ జాతి కింద ఉండాలనీ, వాటిని జెర్మన్ జాతి తన అవసరాలకి వినియోగించుకోవాలని అన్నాడు. జెర్మన్ సాంకేతికత & సంస్థీకరణ ద్వారా ఉక్రెయిన్ ప్రాంతాన్ని జెర్మనీకి ఆహార ధాన్యాలు అందించే సీమగా వృద్ధి చెయ్యాలనుకున్నాడు. నాజీ ప్రోపగాండా ప్రకారం అలా చెయ్యాలంటే జెర్మన్‌లు ఉక్రైన్ సీమని అల్ప జాతీయుల జనాభా చెర నుంచి విడిపించాలి. ఈ అల్ప జాతీయులని జెర్మన్‌ల ఇళ్ళలోనూ, ఫాక్టరీలలోనూ, వ్యవసాయ క్షేత్రాలలోనూ బానిసలుగా వినియోగించాలి. ఎక్కడ అవసరమైతే అక్కడ వీళ్ళని బానిసలుగా వినియోగించుకుని జెర్మన్ ఆర్థిక అవసరాలు తీర్చాలి. ఉక్రైన్‌నీ, ఇతర ప్రాంతాలనీ ఆక్రమించుకోవాలంటే సోవియట్ సమాఖ్యతో యుద్ధం చెయ్యాలి. అందు కోసం జెర్మనీ సంసిద్ధంగానే ఉంది. అందు కోసం నాజీ ప్రోపగాండా మంత్రి అయిన గోబెల్స్ తన అధికారులతో కలిసి సోవియట్ సమాఖ్యకి వ్యతిరేకంగా ప్రచారం చెయ్యసాగాడు. ఉక్రెయిన్‌లో కమ్యూనిస్ట్‌లు స్థానికులపై మారణ కాండ చేశారని ప్రచారం చేశారు. ఉక్రెయిన్‌లో భయానకమైన కరువు వచ్చిందనీ, ఆ కరువుని స్టాలినే కావాలని సృష్టించాడనీ ప్రచారం చేశారు. కృత్రిమ కరువు సృష్టిస్తే రైతులు ఆ కరువుకి భయపడి సోషలిజాన్ని అంగీకరిస్తారనేది స్టాలిన్ పన్నాగమని గోబెల్స్ ప్రచారం చేశాడు. జెర్మన్ ప్రజల దగ్గర అలా ప్రచారం చేసి, దాని ద్వారా సోవియట్ వ్యతిరేక యుద్ధానికి ప్రజల ఆమోదం పొంది, ప్రజా ఆమోదం పేరుతో ఉక్రెయిన్‌పై దాడి చేసి, ఉక్రెయిన్ ప్రాంతాన్ని విముక్తం చేసే పేరుతో ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలనుకున్నారు. నాజీలు ఎలాగోలా కష్టపడి, జెర్మన్ పత్రాలు అనువాదం కూడా చెయ్యించి వాళ్ళ అబద్దపు ప్రోపగాండా ఇంగ్లిష్ పత్రికలలో కూడా వచ్చేలా చేశారు. కానీ వాళ్ళు ఇంగ్లిష్ పత్రికల ద్వారా చేసిన ప్రోపగాండా ప్రపంచ స్థాయిలో అంతగా వ్యాప్తి చెందలేదు. హిట్లర్‌కీ, గోబెల్స్‌కీ మొదట్లోనే తమ అబద్దాల ప్రోపగాండా కోసం ఇతరుల సహాయం అవసరం అయ్యింది అనేది సుస్పష్టం. కానీ వీళ్ళకి ఆ సహాయం అమెరికాలో దొరికింది. (అమెరికాలో వీళ్ళకి దొరికిన సహాయం ఏమిటో మూడో భాగంలో వ్రాస్తాను. వీళ్ళకి సహాయం చేసిన ఇతరుల గురించి తరువాతి భాగాలలో వ్రాస్తాను.)